నారా లోకేష్..ముఖ్యమంత్రి కొడుకు.. తనకి ఎమ్మెల్సీ పదవి, ఇచ్చి మంత్రిని చేయగానే ఎన్నో విమర్శలు.. తెదేపా లో లోకేష్ కన్నా సమర్థులు లేరా అని ప్రతిపక్షాల మూతి విరుపులు.. పోనీ మంత్రి పదవి తీసుకుంటే తీసుకున్నాడు, లోకేష్ కి కేటిఆర్ పోలికేంటి.,కేటిఆర్ తీసుకున్న శాఖలనే ఈయన ఎందుకు తీసుకున్నాడు? కేటిఆర్ సామర్థ్యం ముందు లోకేష్ ఎంత? లోకేష్ ఫెయిల్ అవడం ఖాయం అని అంతా అనుకున్నారు.. ఇప్పుడు లోకేష్ చేపట్టిన పంచాయితీరాజ్ శాఖలో తను చేసిన పని చూస్తే విమర్శించిన వాళ్ళే ప్రశంసించాల్సిందే.. అంతగా ఏం చేసాడంటారా? అయితే ఈ స్టోరీ చదవండి..

పంచాయతీరాజ్ శాఖలో గ్రామీణ మంచినీటి సరఫరా కూడా ఒక భాగం. ప్రతీ ఏటా వేసవిలో నీటి ఎద్దడి రావడం, తాగునీటి కోసం ప్రజలు నానా కష్టాలు పడటం రొటీన్ గా జరిగే వ్యవహారమే. లోకేష్ ఈ సమస్యను ఛాలెంజింగ్ గా తీసుకున్నారు.. అలెర్ట్ మానేజ్ మెంట్ సిస్టం AMS అనే సిస్టం తో పాటు, జలవాణి పేరుతో ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసారు. ప్రజలకి తాగునీటి ఇబ్బందులు ఉంటె టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయమని చెప్పారు. అలాగే ప్రతి రోజు, అన్ని పత్రికల్లో, అన్ని జిల్లాల ఎడిషన్స్ చూసి, తాగునీటి సమస్యపై వచ్చిన కథనాలు అన్నీ ఒక డాష్ బోర్డ్ లో ఎంటర్ చేస్తారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా లో వచ్చే వార్తలని కూడా ఎంటర్ చేస్తారు.

ఏ గ్రామంలో సమస్య ఉంటె ఆ గ్రామ అధికారి, మండల అధికారి, ఆపై అధికారికి కూడా సమస్య గురించి sms, పత్రికా క్లిప్పింగ్ వెంటనే వెళ్ళే ఏర్పాటు చేశారు . ఇది రిసీవ్ చేసుకున్న సంబంధిత అధికారి సమస్య ఉన్న గ్రామానికి వెళ్లి, ఫిర్యాదుదారుతో మాట్లాడి సమస్యని పరిష్కరించాలి. సమస్య పరిష్కరించినట్లు తాను డాష్ బోర్డ్ లో అప్డేట్ చేయాలి. దీన్ని పైస్థాయి అధికారి నిర్ధారించుకుని వర్క్ కంప్లీటెడ్ అని అప్డేట్ చేయాలి.

పని పూర్తికాకపోయినా ఒక్కోసారి అధికారులు కంప్లీటెడ్ అని అప్డేట్ చేసే అవకాశం ఉంది. అందుకే, ఫిర్యాదుదారుకి కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తారు. అతని సమస్య సంతృప్తికరంగా పరిష్కారం అయ్యిందా లేదా అడుగుతారు. ఫిర్యాదుదారు గనుక తమ సమస్య పరిష్కారం కాలేదని చెబితే, టికెట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇలా రీఓపెన్ చేయాల్సిన కంప్లైంట్స్ ఏ జిల్లాలో ఎక్కువ ఉంటె ఆ జిల్లా అధికారులతో లోకేష్ స్వయంగా మాట్లాడేవారు. దీనితో అందరూ అలెర్ట్ గా ఉండడం మొదలుపెట్టారు.

ఒక నెల తర్వాత ఈ AMS పనితీరుని లోకేష్ సమీక్షిస్తే ఫిర్యాదుదారులలో కేవలం 35% మందే సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిసింది. దీనితో అన్ని జిల్లాల అధికారులతో లోకేష్ అమరావతిలో సమీక్ష జరిపారు. నిధుల కొరత ఉండడం వల్ల తాగునీటి సమస్య పరిష్కరించలేకపోతున్నామని అధికారులు చెప్పారు. వెంటనే లోకేష్, కరువు మండలాలకి మండలానికి రెండు లక్షల చొప్పున, ఇతర మండలాలకి లక్ష చొప్పున అత్యవసర నిధులు కేటాయించారు. దీనితో ప్రజల సమస్యలు చకచకా పరిష్కారం అయ్యాయి. సగటున ఒక్కో సమస్య పరిష్కారానికి 3 రోజుల 9 గంటల సమయం పట్టింది. ఇప్పుడు ఈ జలవాణి కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదుచేసినవారిలో 77% మంది తమ సమస్య సంతృప్తికరంగా పరిష్కారం అయిందని చెబుతున్నారు.

జలవాణి లో ఫిర్యాదుచేసినా ఇంకా పరిష్కారం కాని కొన్ని సమస్యలు ఉంటాయి. వాటికి భారీగా నిధుల అవసరం ఉండడమో, లేక రాష్ట్రస్థాయిలో ఇతర శాఖల అనుమతులలో జాప్యం లాంటి కారణాలు ఉంటాయి. అలాంటివి తక్షణం పరిష్కారం కాకపోయినా లోకేష్ డ్యాష్ బోర్డ్ మీద పెండింగ్ అని కనబడుతుంటాయి. వాటిని వీలుని బట్టి పరిష్కరిస్తారు.

చాలా ప్రభుత్వ శాఖల పనితీరు మీద ప్రజల్ని ఫీడ్ బ్యాక్ ఇవ్వమంటే నెగటివ్ మార్కులు వేస్తారు. అలాంటిది, ఫిర్యాదుచేసిన వారిలో 77% మంది సంతృప్తికరంగా ఉండడం అంటే అది చాలా గొప్ప విషయం. టెక్నాలజీ ని ఉపయోగించుకుని, ఉద్యోగులలో జవాబుదారీతనం పెంచి, ఫోకస్డ్ గా పనిచేస్తే ప్రజల సమస్యలు పరిష్కరించడం పెద్ద కష్టమేమీ కాదని లోకేష్ రుజువు చేసారు. ఇంత బాగా పనిచేసిన లోకేష్ ని కొరడా.కాం మనస్ఫూర్తిగా అభినందిస్తోంది.